పార్లమెంటులో టిడిపి ఎంపి ల నిరసన…కాటన్ దొరగా శివప్రసాద్..

547

ఏపి కి ప్రత్యెక హోదా కావాలంటూ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన తెలుగు దేశం పార్టీ, అది వీగిపోవడంతో ఆ తరువాత నుంచి పార్లమెంటు లోపలా బయటా తమ నిరసనను తెలియజేస్తున్నారు..ఏపీకి న్యాయం చేయాలంటూ సభ లోపల, వెలుపల నేతలు ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా ఎంపీలు సభలో తమ నిరసననను తెలిపారు. రోజూలాగే ప్లకార్డులతో ప్రత్యేక హోదాతో పాటూ విభజన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఇటు రాజ్యసభలోనూ ఎంపీలు తమ నిరసనను తెలియజేశారు…

 

పార్లమెంట్ ప్రారంభం కాకముందు కూడా ఎంపీలు గేటు దగ్గర ధర్నాకు దిగారు. ప్లకార్డులతో ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ నినాదాలు చేశారు. రోజుకో వేషంతో కనిపించే చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఇవాళ కాటన్ దొర వేషంలో నిరసన తెలిపారు. టీడీపీతో స్నేహం చేసే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని.. ఇప్పటికైనా వితండవాదం మానేసి పోలవరానికి నిధులు మంజూరు చేయాలన్నారు శివప్రసాద్. ఈ ప్రాజెక్టుతోనే ఏపీ సస్యశ్యామలం అవుతుందని వ్యాఖ్యానించారు.

అవిశ్వాస తీర్మానం తర్వాత కూడా టీడీపీ ఎంపీలు తమ నిరసనను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ ఆవరణలో రోజూ ధర్నాలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రతి రోజూ ఎంపీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తూ.. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశా నిర్దేశం చేస్తూనే ఉన్నారు.