పవన్ ని మోసం చేసిన ప్రజారాజ్యం నేతలు..!

660

ప్రజారాజ్యం..ఎప్పుడో మూసిన పార్టీ..ఇప్పుడేంటి అనుకుంటున్నారా…ఆ పార్టీ గురించి పవన్ కళ్యాన్ తాజాగా ప్రస్తావించారు…జనసేన స్థాపించిన తరువాత ప్రజారాజ్యం గురించి ఏ నాడూ నోరు మెదపని పవన్ కళ్యాణ్ తాజాగా భీమవరంలో విద్యార్థులతో జరిగిన సదస్సులో అప్పటి ప్రజారాజ్యం నేతల పలాయనవాదం గురించి చక్కగా వివరించారు.

పేరెత్తకుండానే ఆనాడు తనవెంట ఉన్నవాళ్లంతా పిరికిపందలు అనేశారు. కష్టాలు ఎదురైనా నిరాశ పడకుండా ముందుకు సాగాలనే మెసేజ్ ఇస్తూ ప్రజారాజ్యం ప్రచారంలో జరిగిన సంఘటనల్ని వివరించారు. కాంగ్రెస్ లో ఒక నాయకుడిని పంచలూడదీసి కొడతానంటే తర్వాతి రోజు పార్టీ ఆఫీస్ లో ఒక్కడు కూడా కనిపించలేదని, కాంగ్రెస్ వాళ్లు దాడిచేయడానికి వస్తారని భయపడి పారిపోయారని అన్నారు పవన్ కల్యాణ్. ఆనాడు తనకు అండగా నిలిచింది ఉస్మానియా విద్యార్థులని, కష్టాల్లో ఉన్నప్పుడే మనుషుల వ్యక్తిత్వాలు బయటకి వస్తాయని అన్నారు పవన్. నిజమే.. ఆనాటి ఊపులో పవన్ కల్యాణ్ కాంగ్రెస్ వాళ్ల పంచలూడదీసి కొడతామని పెద్ద పెద్ద డైలాగులే చెప్పాడు. ఆ మాటలు తీవ్ర విమర్శలకు దారితీయడంతో ప్రజారాజ్యం నేతలే కాస్త సంయమనం పాటించారు.

అయితే దీన్ని ఇప్పుడు మరోలా చెప్పుకొచ్చారు పవన్. తన మాటల కారణంగా కాంగ్రెస్ వాళ్లు దాడిచేస్తారనే భయంతో ప్రజారాజ్యం పార్టీ నేతలు ఆ తర్వాతి రోజు ఆఫీస్ కి రాకుండా పారిపోయారని దెప్పిపొడిచారు. పవన్ చెప్పింది నిజమై ఉండొచ్చేమో. మరి అప్పుడే ఆయన ఎందుకు బైటపడలేదు, కనీసం ఆ తర్వాతయినా ఎప్పుడూ ఆ విషయాన్ని చెప్పలేదు కూడా. కాంగ్రెస్ వాళ్ల పంచెలూడకొడతాం అన్నప్పుడు చప్పట్లు కొట్టిన నాయకులే, తర్వాతి కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయారు. పార్టీ అధినేత చిరంజీవితో సహా పంచెల పంచన చేరారు. ఆ తర్వాత ఈ పంచెల వ్యవహారం పెద్ద జోక్ గా మారింది. మొత్తానికి పవన్ కల్యాణ్ కి అప్పటి ప్రజారాజ్యం నేతలు, వారి ప్రవర్తనపై సంతృప్తి లేదనే విషయం ఇప్పటి ఆయన మాటల ద్వారా స్పష్టమైంది.