సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపధ్యంలో రాజకీయ పార్టీలు వివిధ పేర్లతో కార్యక్రమాలు రూపొందించి జనాల చెంతకు చేరువ అవడానికి ప్రయత్నిస్తున్నాయి..వైసిపి అధినేత జగన్ ఇప్పటికే ప్రజా సంకల్ప యాత్ర పేరిట పాదయాత్రతో రాష్ట్ర ప్రజలకు బాగా దగ్గరవుతున్నారు…తానె కాకుండా మిగిలిన వైసిపి నేతలను కూడా ప్రజలను చేరువ చేసేందుకు కొత్త కార్యాచరణ ను రూపొందించారు…ఇందులో భాగంగా వైసీపీ అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్తలతో ఈ నెల 29న తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జగన్ సమావేశం కానున్నారు..
‘నిన్ను నమ్మం బాబు’ పేరుతో తొలిదశ ప్రచార శంఖారావాన్ని పూరించనున్నట్టు సమాచారం. వైసీపీకి ఎందుకింత భావదారిద్ర్యమో అర్థంకాదు. ఎన్నికల నేపథ్యంలో జగన్ పేరును ప్రధానంగా జనంలోకి తీసుకెళ్లకుండా మంచి లేదా చెడుకావచ్చు… మళ్లీ బాబు పేరు వారి మనసుల్లో మెదిలేలా చేయడం ఎందుకో మరి. అసలు చంద్రబాబు తనను తానే నమ్మరు. ప్రజలను అంతకంటే నమ్మరు. ఆయన నమ్మకం డబ్బు, ఇతరత్రా ప్రలోభాలపైన్నే. చంద్రబాబు నమ్ముకున్నవే ఆయన్ను పదికాలాల పాటు పదవిలో కొనసాగిస్తున్నాయి. అలాంటిది వైసీపీ తాను నిన్ను నమ్మం బాబు అనడమేంటో జగన్‌కే తెలియాలి.
వైసీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారో, ఎలా చేస్తారో వివరిస్తూ జగన్‌పై నమ్మకం కలిగేలా ప్రజల్లో అవగాహన పెంచాలి. ఎందుకంటే నవరత్నాల పేరుతో జగన్ చెబుతున్న సంక్షేమ పథకాలు రాష్ర్ట ఆర్థిక పరిస్థితి దృష్య్టాఆసాధ్యమని ప్రత్యర్థులే కాకుండా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు ‘నిన్నునమ్మం బాబు’ అని జగన్ ప్రచార కార్యక్రమానికి పేరు పెట్టడంలో ఔచిత్యం ఏంటి? ఎన్నికల ప్రచారం అంటే చంద్రబాబును తిట్టే కార్యక్రమమని జగన్ నమ్ముతున్నారా?
టీడీపీ ఇంటింటికి తెలుగుదేశం పేరుతో ఇప్పటికే ఒకదఫా ప్రచారాన్ని పూర్తిచేసింది. అలాగే చంద్రబాబు పాలన 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా జూలై 16 నుంచి మళ్లీ టీడీపీ గ్రామదర్శిని, నగరదర్శిని పేర్లతో సంక్రాంతి వరకు..75రోజుల పాటు పార్టీ శ్రేణులు పూర్తిగా ప్రజల మధ్య ఉండేలా చంద్రబాబు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మొదలుకుని నాయకులంతా నిత్యం జనం దగ్గరికి వెళుతూ రాష్ర్టంలో తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రాష్ర్టానికి బీజేపీ, వైసీపీ, జనసేన పార్టీలు చేస్తున్న ద్రోహాన్ని వివరిస్తున్నారు.
ఈ ప్రచారంలో టీడీపీ ఏ మేరకు సత్ఫలితాలు సాధిస్తుందనేది పక్కనపెడితే… వారి ప్రయత్నం విజయవంతంగా సాగుతోంది. మంచి ఉంటే ప్రత్యర్థుల నుంచి సైతం వైసీపీ తీసుకోవడంలో తప్పులేదు. ఇలాంటి పని చేయకుండా పదేపదే బాబు పేరే ప్రజల మధ్య చర్చకు వచ్చేలా కార్యక్రమాన్ని ఎలా రూపొందిస్తారో తెలియడంలేదు. అక్టోబర్ 16 వరకు నిర్వహించనున్న ప్రచార కార్యక్రమ శీర్షిక పేరు మార్పుపై భేషజాలకు వెళ్లకుండా వైసీపీ పునరాలోచిస్తే మంచిది.