తమ్ముడా..కాంగ్రెస్సా..చిరు దారెటు..?

677

మెగాస్టార్ గా సినీరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిరంజీవి 2009 ఎన్నికల ముందు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తరువాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసారు..ఆ తరువాత రాజ్యసభ సభ్యుడిగా కేంద్రమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు…రాష్ట్ర విభజన తరువాత ఏపి లో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకు పోవడంతో చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు..ప్రస్తుతం ఆయన సినిమాల్లో బిజీ అయిపోయారు…రాజకీయాలపై ఈ మధ్యకాలంలో చిరంజీవి ఎక్కడా కామెంట్‌ చేసింది లేదు. అయితే, ‘తమ్ముడు పవన్‌ రూటు వేరు.. నా రూటు వేరు.. గమ్యం ఒక్కటే.. మేమిద్దరం రైలు పట్టాల్లాంటివాళ్ళం.. కలిసే అవకాశాల్లేవు..’ అని ఆ మధ్య చిరంజీవి క్లారిటీ ఇచ్చేశారు.

ఇంతకీ, చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరవుతారా.? లేదా.? పీసీసీ అధ్యక్షుడు (ఆంధ్రప్రదేశ్‌) రఘువీరారెడ్డి మాటల్లో అయితే, 2019 ఎన్నికల్లో చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీ తరఫున ప్రచారం చేస్తారట. ఈ విషయాన్ని పదే పదే చెబుతున్న రఘువీరారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ వైపు మెగా అభిమానుల్నీ, కాపు సామాజిక వర్గాన్నీ తిప్పేందుకు ప్రయత్నిస్తున్నారన్నది ఓపెన్‌ సీక్రెట్‌. మొత్తంగా మెగా అభిమానుల్ని జనసేనలో కలిపేసుకున్నారు పవన్‌కళ్యాణ్‌ ఈ మధ్యనే. ‘మెగా కుటుంబంలో వేర్వేరు రాజకీయ అభిప్రాయాలకు తావు లేదు’ అనే సంకేతాల్ని మెగా కాంపౌండ్‌ ఈ మధ్యనే పంపిందంటే దానర్ధనం, చిరంజీవి కూడా పరోక్షంగా జనసేనకు మద్దతిస్తున్నట్టే కదా.!

మరి, చిరంజీవి జనసేన పార్టీకి ఎంత దగ్గరగా జరుగుతారు.? ఇదే ఇప్పుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్న. పవన్‌కళ్యాణ్‌ మనస్తత్వం చిరంజీవి కంటే బాగా ఇంకెవరికి తెలుసు.? సో, పవన్‌ పార్టీ జోలికి చిరంజీవి వెళ్ళకపోవచ్చు. తమ్ముడు కాబట్టి, పవన్‌కళ్యాణ్‌ పట్ల చిరంజీవి రాజకీయంగా కొంత సాఫ్ట్‌ కార్నర్‌ మాత్రమే ప్రదర్శించే అవకాశముంది.

అన్నట్టు, మెగా అభిమానుల్లోనూ ఎవరూ చిరంజీవి, జనసేనలోకి వెళ్ళాలని కోరుకోవడంలేదు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం రాజకీయంగా సాధించిన అత్తెసరు మార్కులు, ఆ తర్వాత చిరంజీవి – కాంగ్రెస్‌లో ప్రజారాజ్యం పార్టీని కలిపెయ్యడం.. ఇవన్నీ మెగా అభిమానుల్లో చాలామందిని బాగా హర్ట్‌ చేశాయి మరి. అఫ్‌కోర్స్‌, పవన్‌కళ్యాణ్‌ తక్కువోడేం కాదు.. టీడీపీతోనూ, బీజేపీతోనూ నిన్న మొన్నటిదాకా అంటకాగి.. ఇప్పుడు ‘నా జెండానే వేరు, నా ఎజెండానే వేరు..’ అంటున్న పవన్‌ని రాజకీయంగా జనం విశ్వసించేదెలా.?