చంద్రబాబు కే షరతులు పెడుతున్న మాజీ ఎంపి…!

598

సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పార్టీలు తమ సమీకరణాలను చూసుకుంటున్నాయి..ఒంగోలు పార్లమెంట్ నియోజక వర్గంలో వైసిపి బలంగా ఉండడంతో అక్కడ ఆ పార్టీ అభ్యర్ధిని ఎదుర్కునేందుకు ధీటైన అభ్యర్దిని నిలబెట్టాలన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు మాగుంట శ్రీనివాసుల రెడ్డిని అక్కడ ఎంపి అభ్యర్దిగా పోటీ చేయమని అడిగినట్టు సమాచారం..ఆయన్ను అక్కడ పోటీలో దించితే పార్టీ ఖజానా నుంచి ఒక్క పైసా కూడా తీయనవసరం లేదని.. ఒంగోలు పార్లమెంటు సీటు – ఆ జిల్లాలోని అసెంబ్లీ సీట్ల ఎన్నికల ఖర్చంతా శ్రీనువాసుల రెడ్డే చూసుకుంటారన్నది చంద్రబాబు ప్లాన్. దానికి శ్రీనివాసుల రెడ్డి నుంచి అభ్యంతరమేమీ రాలేదట.. కానీ… తన లోక్ సభ స్థానం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లకు ఎవరెవరికి టిక్కెట్లివ్వాలనేది మాత్రం తనకే వదిలేయాలంటున్నారట. ఇప్పుడున్న సిటింగుల్లో చాలామందిని మార్చాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. ఈ మేరకు ఆయన చంద్రబాబుకే నేరుగా చెప్పారట. వారిని మారిస్తేనే తాను పోటీ చేస్తానని ఆయన చెప్పినట్లు సమాచారం. డీటెయిల్డ్ రిపోర్టు కూడా ఇచ్చారట…

ఎవరిని మార్చినా మార్చకపోయినా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు – యర్రగొండ పాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజును మార్చాల్సిందేనని శ్రీనివాసుల రెడ్డి చెప్పారట. ఇంకా మరికొన్ని మార్పులు కూడా ఆయన సూచించారని తెలుస్తోంది. అయితే.. మాగుంట రిపోర్టు సంగతి తెలిసిన కదిరి బాబూరావు – డేవిడ్ రాజులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారట. తమకు కనుక టిక్కెట్లు రాకపోతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తామని.. మాగుంటను ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు.

ఈ గొడవ ఇలా ఉండగా…. మాగుంట డిమాండ్లకు చంద్రబాబు ఓకే చెప్పారని తెలుస్తోంది. ఒంగోలు పార్లమెంటుకు మాగుంటను మించిన అభ్యర్థి లేకపోవడం.. ఎన్నికల ఖర్చు చూసుకునే సత్తా ఆయనకు ఉండడం వంటి కారణాలతో చంద్రబాబు ఆయన చెప్పిన ప్రతిదానికీ తల ఊపారని టాక్. దీంతో ప్రకాశం జిల్లాలో టిక్కెట్లు ఆశిస్తున్న నేతలంతా మాగుంట వద్దకు క్యూ కడుతున్నారట.