కాపు రిజర్వేషన్లపై పవన్ ఏమన్నారంటే..!

609

కాపు రిజర్వేషన్లపై వైకాపా అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి..జగన్ చేసిన వ్యాఖ్యలపై తెలుగుదేశం నాయకులు విమర్సలకు దిగారు..తాజాగా ఈ అంశంపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తనదైన రీతిలో స్పందించారు..కాపుల రిజర్వేషన్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ తొలి సమావేశం హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించారు.రిజర్వేషన్ల విషయాన్ని కేవలం రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా అధికార, ప్రతిపక్ష పార్టీలు వాడుకొంటున్నాయని పొలిటికల్ అఫైర్స్ కమిటీ అభిప్రాయపడింది…

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ, గందరగోళంతో, కులాల మధ్య దూరాలు పెంచి ప్రయోజనాన్ని పొందే పనిలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయని, ఈ అంశంపై కూలంకషంగా అధ్యయనం చేసేందుకు నిపుణులతో చర్చించాలని , అర్హులైన వర్గాలన్నింటికీ రాజకీయ ఫలాలు అందాలని చెప్పారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా ప్రకటనలు చేయడం బాధ్యతారాహిత్యమే అవుతుందని అన్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఆచరణాత్మక విధివిధానాలతో కూడిన నిర్ణయాలు అవసరమని, పాలకులు ఈ విషయంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాల్లోని లోపాల మూలంగా ప్రజల మధ్య అంతరాలు పెరిగే పరిస్థితులు వచ్చాయని విమర్శించారు.