కరుణానిధి ఆరోగ్యం పై వదంతులు…ఆందోళనలో అభిమానులు..

563

డిఎంకె అధినేత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అస్వస్థతతో ఆస్పత్రి పాలయిన సంగతి తెలిసిందే..ప్రస్తుతం ఆయన ఆరోగ్యంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి..ఆయన ఆరోగ్యం విషమించిందని కావేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వదంతులు వ్యాపించడంతో ఆయన అభిమానులు, కార్యకర్తలు భారీగా కావేరి ఆసుపత్రి వద్దకు చేరుకుంటున్నారు…ఈ నేపథ్యంలో తాజాగా కరుణానిధి ఆరోగ్యంపై కావేరి ఆసుపత్రి వైద్యులు స్పందించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై `కావేరీ` వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. కరుణానిధికి ప్రస్తుతం వెంటిలేటర్ పై చికిత్స కొనసాగుతోందని ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు వెల్లడించారు. కరుణానిధి ఆరోగ్యం నిలకడగా ఉందని మరో 2 రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని కనిమొళి కూడా మీడియాకు తెలిపారు…

కొంతకాలంగా కరుణానిధి(94) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన గొంతులో అమర్చిన ట్రాకియాస్టమీ ట్యూబ్ మార్పిడి కారణంగా కరుణానిధికి స్వల్పంగా జ్వరం ఇన్ఫెక్షన్ సోకింది. ఈ నేపథ్యంలో ఆయనకు గోపాలపురంలోని ఆయన స్వగృహంలోనే శుక్రవారం వైద్యులు చికిత్స అందించారు. అయితే హఠాత్తుగా ఒక్కసారి బీపీ పడిపోవటంతో అర్ధరాత్రి హుటాహుటిన కరుణను కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉన్న కరుణకు వెంటిలేటర్ల సాయంతో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అదుపులోనే ఉందన్న వైద్యుల ప్రకటనతో ఆ వదంతులకు తెరపడినట్లయింది. మరోవైపు కరుణానిధి ఆరోగ్యంపై కనిమొళి స్పందించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని బీపీ కంట్రోల్ లోకి వచ్చిందని తెలిపారు. ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. మరో 2 రోజుల్లో ఆయన పూర్తి ఆరోగ్యంతో ఇంటికి తిరిగొస్తారని చెప్పారు.