అవిశ్వాసం ఓడింది…మోడీ ధీమా గెలిచింది..

519

పార్లమెంట్ లో తెలుగుదేశం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయింది..శుక్రవారం(జూలై 20) జరిగిన ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా 325 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు చేసారు…దాంతో స్పీకర్ అవిశ్వాస తీర్మానం వీగిపోయిందని ప్రకటించి సభను సోమవారానికి వాయిదా వేశారు. అంతకు ముందు ఉదయం 11 గంటల నుంచి అధికార విపక్షాలు తమ వ్యూహాలకు పదును పెట్టి అవిశ్వాస తీర్మానంపై చర్చను కొనసాగించారు..రాత్రి 11 గంటలకు ఓటింగ్ జరిగింది..

ప్రస్తుతం 534మంది సభ్యులున్న లోక్సభలో బలనిరూపణకు 268మంది సభ్యుల కనీస మద్దతు అవసరం ఉండగా 325 ఓట్లు దక్కాయి. బీజేపీకి 273మంది సభ్యులుండగా ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో కలిపితే ఆ సంఖ్య 314కు చేరుకుంది. బలపరీక్షలో బీజేపీ సునాయాసంగా నెగ్గే అవకాశమున్నప్పటికీ రానున్న లోక్సభ ఎన్నికల ముంగిట విపక్షాల ఐక్యతను చాటేందుకు నాలుగేండ్ల మోడీ సర్కార్ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు దీన్ని ఒక వేదికగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ యోచించింది. అయితే తమ సత్తాను చాటుకునేందుకు ప్రధాని మోడీ సైతం అవిశ్వాసాన్ని వేదికగా చేసుకొని వ్యూహాలు రచించడంతో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారు సునాయాసంగా టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాసాన్ని ఓడించింది.

అవిశ్వాసంపై సుదీర్ఘ చర్చ అనంతరం శుక్రవారం రాత్రి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆటోమేటిక్ విధానంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వహించారు. వాయిస్ ఓటును పసుపు ఆకుపచ్చ ఎరుపు రంగుల్లో బటన్స్ నొక్కడం ద్వారా తెలియజేసే విధానంలో ఓటింగ్ నిర్వహించారు. దశాబ్దన్నర తర్వాత లోక్సభలో చేపట్టిన అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 సభ్యులు మద్దతు పలకగా 325 మంది ఎంపీలు వ్యతిరేకంగా నిలవడంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది.