BREAKING NEWS- ప్ర‌ముఖ న‌టుడు మృతి షాక్ లో టాలీవుడ్

170

కోలీవుడ్‌ నటుడు, పార్లమెంటు మాజీ సభ్యుడు జేకే రితీష్‌ శనివారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన వయస్సు 46 సంవత్సరాలు. ఎంతో ఉత్సాహంగా కనిపించే ఆయన అకాల మరణంతో కోలీవుడ్‌ దిగ్ర్భాంతికి గురైంది. 2007వ సంవత్సరం ‘కానల్‌నీర్‌’ చిత్రం ద్వారా నటుడు, దర్శకుడు చిన్నిజయంత్‌ జేకే రితీష్‌ను హీరోగా కోలీవుడ్‌కు పరిచయం చేశారు. అనంతరం ఆయన నటించిన ‘నాయగన్‌’ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఓ మోతాదు విజయం సాధించడంతో ఆయనకు పేరు ప్రతిష్ఠలతో పాటు అభిమాన సంఘాలు కూడా వెలిశాయి. తదుపరి నటించిన చిత్రాలు ప్రారంభ దశలోనే ఆగిపోయాయి.

చివరిగా ‘ఎల్‌కేజీ’ చిత్రంలో విలన్‌గా మరోసారి తెరపై కనిపించి ప్రేక్షకుల మన్ననలను పొందారు. ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుండే రితీష్‌ అనతికాలంలోనే రాజకీయ అరంగేట్రం చేసి తన సొంత నియోజకవర్గం రామనాథపురంలో 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. తరువాత అళగిరికి మద్దతు తెలపడంతో డీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు.

తదుపరి పరిమాణాలతో 2014లో జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. జయకు సన్నిహితుడిగా వుంటూ పార్టీ ప్రచారాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 2016వ సంవత్సరం ఆయనకు మొదటసారి స్వల్ప గుండెపోటు వచ్చింది. యాంజియో చేయించుకుని ఆరోగ్యం మెరుగుపడడంతో ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ, కూటమి పార్టీల అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం లోక్‌సభ అభ్యర్థి మద్దతుగా ప్రచారం చేయడానికి చెన్నై నుంచి రామనాథపురం వెళ్లారు. శనివారం ఉదయం ప్రచారం పనులు ముగించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా హఠాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయన్ని కుటుంబసభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు ధృవీకరించారు.

మళ్లీ ఆయన గుండె కొట్టుకుంటోందని కుటుంబ సభ్యులు మరో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ కూడా ఆయన మృతి చెందినట్టు ధృవీకరించడంతో కుటుంబసభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. రితీష్‌కు భార్య జ్యోతీశ్వరి , అరిక్‌ రోషన్ అనే కుమారుడు వున్నారు. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అంజలి ఘటించేందుకుగాను పార్తివదేహాన్ని రామనాథపురంలోని స్వగృహంలో వుంచారు. అంత్యక్రియలు ఆదివారం జరగనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయన మరణించిన విషయం తెలిసి సినీ ప్రముఖులు, ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ రితీష్‌ కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.