దేవదాస్ కనకాల కన్నుమూత: యాంకర్ సుమ, రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం

165

సినీ ఇండస్ట్రీలో మరొక పెనువిషాదం చోటుచేసుకుంది. యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.. రాజీవ్ కనకాల తండ్రి, ప్రముఖ నటుడు, దర్శకుడు, నట శిక్షకుడు దేవదాస్ కనకాల అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. 1945లో జూలై 30 న యానం సమీపంలోని కనకాలపేటలో జన్మించిన దేవదాస్ కనకాల విశాఖలోని ఎ.వి.యన్ కాలేజీలో డిగ్రీ, ఆంధ్ర విశ్వవిద్యాలయం లో థియేటర్ ఆర్ట్స్ చదివారు. సాంగ్ అండ్ డ్రామా కేంద్ర ప్రభుత్వ పబ్లిసిటీ డివిజన్‌లో నటుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆయన సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. ఫూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు.

Image result for devadas kanakala

ఫూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్లో శిక్షణ పొందిన తొలితరం తెలుగు వారిలో దేవదాస్ కనకాల ఒకరు. నటుడిగా, దర్శకుడిగా రాణించారు. అడయార్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ (మద్రాస్) లో ఎ.ఆర్.కృష్ణ సారథ్యంలో నడిచిన ఆంధ్రప్రదేశ్ రిపర్టరీలోను, మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లోను అధ్యాపకునిగా మరియు తెలుగు విశ్వవిద్యాలయం రంగస్థల కళలశాఖలో అధ్యాపకునిగా, శాఖాధిపతిగా పనిచేశారు. కేంద్రప్రభుత్వ సాంగ్ అండ్ డ్రామా డివిజన్ పబ్లిసిటీ విభాగంలో నటుడిగా ఉద్యోగం చేసే సమయంలో తన సహచర నటి లక్ష్మిని ఆయన వివాహం చేసుకున్నారు. ఈయన నటుడిగానే కాకుండా బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా తెలుగు ఇండస్ట్రీకి ఎంతో మంది హీరోలను, నటులను పరిచయం చేసిన నటగురువు దేవదాస్. ఈయన పేరుతో ఓ యాక్టింగ్ స్కూల్ ఉంది. అక్కడే ఎందరో నటులు శిక్షణ తీసుకున్నారు.

ఈ క్రింద వీడియో చూడండి

ఈయనతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లలో గొప్పగొప్ప నటులు కూడా ఉన్నారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్‌, శుభలేఖ సుధాకర్, నాజర్‌, ప్రదీప్ శక్తి, భానుచందర్‌, అరుణ్‌పాండ్యన్‌, రాంకీ, రఘువరన్ వంటి ప్రముఖులు సైతం ఆయన వద్ద శిక్షణ తీసుకున్నారు. సినీ నటులతోపాటు, టీవీలో ఉన్న నటులంతా దేవదాస్ కనకాల వద్ద నట శిక్షణ పొందినవారే. దర్శకుడిగా కూడా ఆయన గుర్తింపు సంపాదించుకున్నారు. రెండేళ్ల కింద దేవదాస్ కనకాల భార్య చనిపోయారు. అప్పట్నుంచి ఆయన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. తనను వదిలేసి తన దేవత వదిలివెళ్ళిపోయిందని కుములికుమిలి ఏడ్చాడు. ఆ బాధతోనే ఇన్ని రోజులు గడిపాడు.. ఈ క్రమంలోనే అస్వస్థతకు గురవ్వడంతో ఇటీవల ఆయనను కిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈరోజు మృతిచెందినట్టు రాజీవ్‌ కనకాల వెల్లడించారు సిరిసిరి మువ్వ, గోరింటాకు, మంచుపల్లకి, గ్యాంగ్‌లీడర్‌ వంటి అనేక చిత్రాల్లో దేవదాస్‌ నటించారు. చివరగా భరత్‌ అనే నేను చిత్రంలో ఆయన నటించారు. దేవదాస్ కనకాల మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. దేవదాస్‌ కనకాల మృతిపట్ల సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. ఆయన మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు, పలువురు సినీ నటులు కొండాపూర్‌లోని కిమ్స్‌ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్, శుభలేఖ సుధాకర్, రాజేంద్రప్రసాద్, మా అసోసియేషన్ నివాళి అర్పించారు. మనం కూడా కామెంట్ రూపంలో నివాళి అర్పిద్దాం.