సిద్దమవుతున్న ‘బాహుబలి’ ప్రీక్వెల్…నిర్మాతల అధికారిక ప్రకటన

432

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి’ సీరిస్‌లు ఎంతటి ఘన విజయం సాధించాయో తెలిసిందే. ఇండియాలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సత్తాను చాటిన చిత్రం‘బాహుబలి’.ఈ సినిమాకి త్వరలో ప్రీక్వెల్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ వెబ్‌సీరీస్ సంస్థ ‘నెట్‌ఫ్లిక్స్’ గురువారం అధికారికంగా ప్రకటించింది.

‘బాహుబలి – బిఫోర్ ద బిగెనింగ్’ పేరిట అనౌన్స్‌మెంట్ వీడియోను కూడా విడుదల చేసింది.బాహుబలి: ద బిగెనింగ్, బాహుబలి: ద కన్‌క్లూజన్ చిత్రాలను నిర్మించిన ఆర్కా మీడియాతో కలిసి నెట్‌ఫ్లిక్స్ తెరకెక్కించనుంది. ఇది థియేటర్లలో విడుదల కాదు. కేవలం వెబ్‌సీరిస్‌లో మాత్రమే చూడాలి.ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించడం లేదు. వెన్నెల,ప్రస్థానం సినిమాల దర్శకుడు దేవ కట్టా, గుంటూరు టాకీస్,గరుడ వేగల దర్శకుడు ప్రవీణ్ సతారు తెరకెక్కించనున్నారు. ఆనంద్ నీలకంఠన్ రచించిన ‘ద రైజ్ ఆఫ్ శివగామి’ పుస్తకం ఆధారంగా మొత్తం 9 ఎపిసోడ్లుగా ‘బాహుబలి – బీఫోర్ ద బిగినింగ్’ రూపొందించనున్నారు.

ఈ వెబ్‌సీరీస్‌పై రాజమౌళి స్పందిస్తూ.. ‘‘బాహుబలి.. బిగెనింగ్, కన్‌క్లూజన్‌లాగానే ప్రీక్వెల్ కూడా మహిష్మతీ రాజ్యంలోని బలమైన పాత్రలతో తెరకెక్కనుంది. ఈ కథను నెట్‌ఫ్లిక్స్ స్వయంగా వెబ్‌సీరిస్‌గా తెరకెక్కించేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని తెలిపారు.ఇందులో పాత్రదారుల పేర్లను ఇంకా ప్రకటించలేదు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానునున్నట్లు తెలిసింది.