30 ఏళ్ళు పూర్తి చేసుకున్న మెగాస్టార్..!

444

అదేంటీ చిరంజీవి వయసు 60 దాటింది కదా…మరి 30 ఏళ్ళు ఏంటి అనుకుంటున్నారా…వ్యక్తిగా చిరంజీవి వయసు 60 ఏళ్ళు దాటేసాయి…కానీ టాలివుడ్ చరిత్రలో మెగాస్టార్ గా నామకరణం చేసి మాత్రం సరిగ్గా ముప్పైల్లయింది..1988 ఆగస్ట్ 4 న మరణ మృదంగం సినిమా విడుదల సందర్భంగా నిర్మాత కే ఎస్ రామారావు మెగాస్టార్ బిరుదును చిరంజీవి పేరుకు ముందు పెట్టి దాన్ని శాశ్వతం చేసారు..అప్పటి దాకా సుప్రీం హీరో డైనమిక్ హీరో అంటూ పిలుస్తున్న సినీ జనం అప్పటి నుంచి ఆయన పేరును మెగాస్టార్ గా  ఫిక్స్ అయి పోయారు..

ఈ సినిమా విడుదలై ఈ రోజుతో సరిగ్గా 30 ఏళ్ళు. అంటే చిరంజీవికి పేరు ముందు మెగాస్టార్ అని సిల్వర్ స్క్రీన్ మీద పడింది ఇవాళే. అందుకే సోషల్ మీడియాలో ముఖ్యంగా ట్విట్టర్ లో అభిమానులు ఈ సినిమా తాలూకు జ్ఞాపకాలు పోస్టర్లతో మెగాస్టార్ బిరుదు ఎలా వచ్చింది అనే దాని గురించి వివరాలు షేర్ చేసుకుంటున్నారు. మరణమృదంగం ఆ టైంలో వచ్చిన భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణగా యండమూరి వీరేంద్రనాథ్ సూపర్ హిట్ నవల ఆధారంగా కోదండరామిరెడ్డి రూపొందించిన ఈ మూవీ అప్పట్లో డీసెంట్ హిట్ గా నిలిచింది. నవలను విపరీతంగా చదివేసిన ప్రేక్షకులు అందులో ప్రతిదీ సినిమాలో ఉండాలని కోరుకువడంతో బ్లాక్ బస్టర్ రేంజ్ కు చేరుకోలేకపోయింది. కానీ పాటలు మాత్రం ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి. ముఖ్యంగా కరిగిపోయాను కర్పూరవీణలా పాట ఇప్పటికీ మ్యూజిక్ లవర్స్ బెస్ట్ ఛాయస్. మెగాస్టార్ బిరుదును మొదటిసారి మీడియా ముందు ప్రకటించింది రావు గోపాల్ రావు గారు. ఆ టైంలో చిరు ప్రతి సినిమాలో కనిపించే ఈయన మరణమృదంగంలో మాత్రం లేరు.

దీంట్లో విలన్ గా నటించిన బాలీవుడ్ నటుడు సురేష్ ఒబెరాయ్ కొడుకు వివేక్ ఒబెరాయ్ ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలో ప్రతి నాయకుడిగా నటించడం కాకతాళీయం. అందుకే ఇంత స్పెషల్ మూమెంట్ ని మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. కెఎస్ రామారావే నిర్మించిన తేజ్ ఐ లవ్ యు వేడుకలో చిరు కొన్ని జ్ఞాపకాలు నెమరువేసుకున్న సంగతి తెలిసిందే. సో మెగాస్టార్ అనే పేరు పుట్టి 30 ఏళ్ళైన సందర్భం అంటే ఫాన్స్ కి స్పెషల్ కాక ఏముంటుంది.