Breaking News : సినిమా షూటింగ్‌లో పేలిన సిలిండర్.. ఐదేళ్ల చిన్నారితో సహా తల్లి మృతి

255

బెంగళూరు సమీపంలో ఓ సినిమా చిత్రీకరణ సందర్భంగా అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గ్యాస్ సిలిండర్ పేలిపోవడంతో తల్లీబిడ్డలు మృతి చెందారు. శాండిల్‌వుడ్ నటుడు చిరంజీవి సర్జా నటిస్తున్న ‘రణం’ సినిమా చిత్రీకరణలో ఈ విషాదం జరిగింది. తెలుగు, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బెంగళూరులోని బాగలూరు వద్ద సినిమా చిత్రీకరణ జరుగుతుండగా గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో అక్కడకు వచ్చిన ఓ మహిళ ఆమె ఐదేళ్ల కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. షూటింగ్‌లో భాగంగా కారును బ్లాస్ట్ చేసే దృశ్యాలను చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. దీంతో షూటింగ్ చూసేందుకు వచ్చిన సుమనా భాను (28), ఆమె ఐదేళ్ల పాప అయిషా ఖాన్ (5) ప్రాణాలు కోల్పోగా, ఆమె పెద్ద కుమార్తె జైనాబ్ (7) తీవ్రంగా గాయపడింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కేఐఏబీడీ హార్డ్‌వేర్ పార్క్ సమీపంలో చోటచేసుకున్న ఈ ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటీన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

గాయపడిన చిన్నారి జైనాబ్‌ను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పాప పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మృతదేహాలను యలహంక ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులదని కటంజిన్‌హళ్లికి చెందినవారిగా గుర్తించారు. అయితే, అనుమతి లేకుండా షూటింగ్ చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. వాహనాలు వెళ్లకుండా రోడ్డును ఆక్రమించడమే కాకుండా, నిబంధనలకు విరుద్ధంగా బ్లాస్ట్ చేశారని సుమాన్ భర్త తబ్రేజ్ ఖాన్ ఆరోపించారు. డ్రైవర్‌గా తబ్రేజ్ తన భార్య పిల్లలతో అదే మార్గంలో వస్తుండంగా జనం గుమిగూడి ఉన్నారు. తాము కూడా షూటింగ్ చూస్తామని సుమనా భాను, పిల్లలు పట్టుబట్టడంతో అతడు వాహనాన్ని పక్కన నిలిపాడు. దీంతో వాహనం దిగి షూటింగ్ చూడటానికి నలుగురు వెళ్లారు. ఈ సమయంలో సిలిండర్ పేలడంతో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. వీరికి కొద్ది దూరంలో తబ్రేజ్ ఉండటంతో అదృష్టవశాత్తు త్రుటిలో తప్పించుకున్నాడు.

దుర్ఘటనపై నటుడు చేతన్ కుమార్ మాట్లాడుతూ.. ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుల కుటుంబాలకు తనవంతు సాయం చేస్తానని హామీ ఇచ్చాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారిని పరామర్శిస్తానని చెప్పాడు. కాగా, పేలుడు అనంతరం చిత్ర యూనిట్ అక్కడి నుంచి పరారైనట్టు ఏసీపీ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు. కాగా, నటుడు చిరంజీవి సర్జా మరో షూటింగ్‌ కోసం మైసూర్ వెళ్లిపోవడం బాధాకరం. షూటింగ్‌ సమయంలో ఎలాంటి రక్షణపరమైన చర్యలు తీసుకోకపోవడంతో తరుచూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. నవంబరు 2016లో ఇద్దరు నటులు ఇదే విధంగా సినిమా చిత్రీకరణలో ప్రాణాలు కోల్పోయారు. మాస్తిగుడి సినిమా షూటింగ్ సమయంలో ఉదయ్, అనిల్ అనే నటులు నదిలో మునిగి మృత్యువాతపడ్డారు. మరోవైపు, ఈ సినిమాలో తాను అతిథి పాత్ర పోషిస్తున్నానని చెప్పాడు. అంతేకాదు ఆరు నెలల కిందట తన పాత్రకు సంబంధించి చిత్రీకరణ పూర్తయిందని, ఈ ప్రమాదం గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం.మరి ఈ ప్రమాద ఘటన గురించి మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో చెప్పండి.