వరలక్ష్మి వ్రతం రోజున ఏ రంగు చీర కట్టుకుంటే ఐశ్వర్యం మీ సొంతం..

206

మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. మహిమాన్వితమైన “శ్రీ వరలక్ష్మీ” వ్రత పుణ్యదినాన సూర్యోదయానికి ముందే లేచి, అభ్యంగన స్నానమాచరించి, నూతన వస్త్ర ధారణ చేయాలి. తదనంతరం పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకుని, గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని పద్మం ముగ్గులతో రంగవల్లికలను తీర్చిదిద్దాలి. దానిపై పసుపు రాసి ముగ్గులు బొట్లు పెట్టుకున్న పీటను ఉంచి ఆ పీటపై నూతన వస్త్రము పరచి, బియ్యము పోసి, దానిపై అలంకరించిన కలశచెంబును ఉంచాలి. ఒక కొబ్బరికాయను తీసుకుని దానికి “శ్రీ వరలక్ష్మీ” రూపు ప్రతిబింబించేటట్లు పసుపు ముద్దతో కనులు, ముక్కు, చెవులు మున్నగునవి తీర్చిదిద్దుకోవాలి. కుంకుమ, కనులకు కాటుకలను అమర్చి ఆ రూపును కలశపై ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆకుపచ్చని చీరతో కూర్చున్న లక్ష్మీదేవి ఫోటోను గానీ, ప్రతిమను గానీ పసుపు కుంకుమలతో అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి.

ఈ క్రింద వీడియో చూడండి

పూజకు ఎర్రటి అక్షింతలు, పద్మములు, ఎర్రటి కలువ పువ్వులు, గులాబి పువ్వులు, నైవేద్యమునకు బొంబాయి రవ్వతో కేసరి బాత్, రవ్వలడ్డులు, జామకాయలు వంటివి సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో రెండు వెండి దీపాలలో ఆరేసి ఆరేసి మొత్తం 12 తామర వత్తులతో నేతితో దీపమెలిగించాలి. ఇకపోతే.. సాయంత్రం ఆరుగంటల నుంచి పూజను ప్రారంభించాలి. నుదుట కుంకుమ బొట్టు పెట్టుకుని, మెడలో తామర మాల ధరించి పూజను ఆరంభించాలి. శ్రీ లక్ష్మి సహస్రనామము, వరలక్ష్మీ వ్రత కథ పారాయణ చేసి, “ఓం మహాలక్ష్మీదేవ్యై నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. వీలైతే లక్ష్మీ అష్టోత్తరము, మహాలక్ష్మి అష్టకములను పఠించి, తదనంతరం నైవేద్యములను సమర్పించుకుని దేవదేవికి దీపారాధన చేయాలి. పూజ పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు ముత్తైదువులను పిలుచుకుని దక్షిణ తాంబూలాలు ఇచ్చుకోవాలి. స్త్రీలకు తాంబూలముతో పాటు వరలక్ష్మీ వ్రత పుస్తకాలను కూడా అందజేయాలి. వరలక్ష్మీ వ్రత పర్వదినమున అష్టలక్ష్మీ దేవాలయములతో పాటు లక్ష్మీదేవీ ఆలయాలను దర్శించుకుంటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని పురోహితులు అంటున్నారు. ఇంకా దేవాలయాల్లో శ్రీ లక్ష్మీ కుంకుమ పూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తరనామ పూజలు, పంచామృతములతో అభిషేకం చేయించడం సకల భోగభాగ్యాలను ప్రసాదిస్తుంది.

Image result for వరలక్ష్మి

శుక్రవారం పూట వచ్చిన శ్రీ వరలక్ష్మీ వ్రత దినాన నిష్టతో లక్ష్మిదేవిని పూజించే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు. ఆ రోజున స్త్రీలు వరలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే దీర్ఘసుమంగళీ ప్రాప్తం చేకూరుతుందని విశ్వాసం. అయితే మనకు ఇంకా మంచి జరగాలంటే ఆడవారు పసుపు రంగు లేదా ఎరుపు రంగు చీరను కట్టుకుని ఈ వ్రతము ఆచరించాలి. అమ్మవారికి పసుపు, ఎరుపు రంగులంటే చాలా ఇష్టం. ఆ చీర కట్టుకుని వ్రతం చేస్తే అమ్మవారి కరుణ మీ మీద మరింత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వ్రతం చేయాలనుకునేవారు తప్పక ఈ రంగు చీరనే కట్టుకోండి.