రోజుకి ఒక్కసారి మాత్రమే దర్శనమిచ్చే సముద్రపు ఆలయం

364

మన దేశంలో దేవుళ్లకు ఎప్పుడూ ఏదో రకమైన పూజలు చేస్తూనే ఉంటాం. నిత్యం పూజలతోనే సమయం గడిపేవారు కూడా చాలా మంది ఉంటారు. మనకు ఈ దేవతల ఉనికి యుగయుగాలుగా ఉంది. పూర్వం నుంచి పెద్దలు చెప్పడం మనం పాటించడం దేవుడిని కొలవడం చేస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉన్న ప్రతీ దేవాలయానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంది. మరి అలాంటి దేవాలయాల్లో ఈ దేవాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆ ఆలయం గుజరాత్ లోని అరేబియా మహా సముద్రంలో ఉంది. ఆ ఆలయం పేరు స్థంభేశ్వరనాథ ఆలయం. ఇక్కడ పరమశివుడు లింగం రూపంలో కొలువై దర్శనమిస్తాడు. ఈ ఆలయం విశిష్టత తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది మరి ఆ స్టోరీ తెలుసుకుందాం.

గుజరాత్ లోని అహ్మదాబాద్ కు దగ్గర్లో ఉన్న భావ్ నగర్ కు సమీపంలోని కవికాంబోయి గ్రామానికి అత్యంత సమీపంలోని అరేబియా సముద్రంలో స్థంభేశ్వరనాథ ఆలయం ఉంటుంది. వడోదర నుంచి అయితే దాదాపు 52 కిలోమీటర్ల దూరంలో కవికాంబోయి ఉంటుంది. అహ్మదాబాద్ లేదా వడోదరలలో ఏ ప్రాంతానికి చేరుకున్నా సరే అక్కడి నుంచి కవికాంబోయి వెళ్లవచ్చు. అయితే కవికాంబోయి వెళ్లడానికి బస్సు కన్నా ట్యాక్సీ ద్వారా ప్రయాణిస్తేనే మంచిది. సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ క్రమంలో కవికాంబోయి వెళ్లాక అక్కడ ఉండే సముద్రపు ఒడ్డు నుంచి సుమారు ఒకటిన్నర కిలోమీర్ల దూరంలో కాలి నడకన వెళితే ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. దీంతో స్వామి వారి దర్శనం లభిస్తుంది.

అయితే స్థంభేశ్వరనాథ ఆలయానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీలు లేదు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6.30 గంటల లోపు మాత్రమే దర్శనానికి అనుమతినిస్తారు. ఎందుకంటే మిగిలిన సమయంలో ఈ ఆలయం మునిగిపోయి ఉంటుంది. కేవలం ఆలయ శిఖరం, ధ్వజ స్తంభాలు తప్ప మరేమీ కనిపించవు. అందుకే ఈ ఆలయానికి స్థంభేశ్వరనాథ ఆలయం అని పేరు వచ్చింది. ఇక పైన చెప్పిన సమయం రోజూ ఒకేలా ఉండదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కనుక రోజూ ఆలయం పైకి తేలే సమయం కూడా వేరేగా ఉంటుంది. దీన్ని గమనిస్తూ అక్కడ ఉండేవారు పర్యాటకులకు లింగం కనిపించే సమయం చెబుతారు. అందుకు అనుగుణంగా చిట్టీలు ఇస్తారు. ఆ చిట్టీల్లో ఉన్న సమయాన్ని బట్టి ఆలయాన్ని దర్శించుకుని రావాలి. అప్పుడే లింగం పైకి తేలి కనబడుతుంది. సమయం దాటేదాక వేచి ఉండకూడదు. లేదంటే ఆలయంతోపాటు నీటిలో మునగాల్సి వస్తుంది. ఇక ఆలయానికి వెళ్లేందుకు తీరం నుంచి దేవాలయం వరకూ కట్టిన తాడును పట్టుకుని వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదం బారిన పడతారు.

ఈ క్రింది వీడియో ని చూడండి

ఇక ఈ ఆలయంలోకి 70 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్ల లోపు వారిని అనుమతించరు. ఎందుకంటే ఈ ఆలయం వద్దకు వెళ్లడం ఎంతైనా కొంత రిస్క్తో కూడుకున్న పని. కనుకనే వారిని అనుమతించరు. ఇకపోతే ఈ ఆలయంలో పూజారులు ఎవరూ ఉండరు. భక్తులు వెళ్లి లింగానికి అభిషేకం చేసి పూలు సమర్పిస్తారు. లింగం మునిగాక ఆ పూలు ఒడ్డుకు వస్తాయి. వాటిని భక్తులు పవిత్రంగా భావిస్తారు. వాటిని ఇండ్లలో పెట్టుకుంటే సమస్యలు పోతాయని నమ్ముతారు.

ఈ ఆలయం రోజులో చాలా వరకు సముద్రంలో మునిగే ఉంటుంది. కేవలం కొంత సేపు మాత్రమే తేలి ఉంటుంది. ఆ సమయంలోనే భక్తులు ఆలయానికి వెళతారు. ఇక ఈ ఆలయం మునిగి పోవడం, తిరిగి పైకి తేలడం వంటి రెండు ఘట్టాలను చూడటానికి ఒక రోజు మొత్తం ఈ సముద్రపు ఒడ్డున గడపాల్సి ఉంటుంది. అయితే ఈ దేవాలయంలో శిల్పకళ సంపద పెద్దగా ఉండదు. కానీ వందల ఏళ్లుగా సముద్రపు నీటిలో మునిగి, తేలుతూ ఉన్నప్పటికీ ఆలయం చెక్కు చెదరక పోవడం మాత్రం ఇక్కడ ఉన్న వింతగా చెబుతారు. కాగా పౌర్ణమి రోజున ఇక్కడి లింగం ఒక ద్విగుణీకృతమైన కాంతితో మెరుస్తుందని చెబుతారు. పున్నమి రోజున ఈ దేవాలయ దర్శనం కొంత రిస్కుతో కూడుకున్నది అయినా చాలా మంది అదే రోజు ఈ దేవాలయ దర్శనం కోసం వస్తుంటారు.

శివభక్తుడైన తారకాసురడనే రాక్షసుడిని వధించిన తర్వాత కుమారస్వామి ఈ లింగాన్ని ఇక్కడ స్థాపించి పూజించాడని స్కంధపురాణం వివరిస్తుంది. మరో కథనం ప్రకారం కురుక్షేత్రం తర్వాత అన్నదమ్ములను చంపిన పాపం నుంచి విముక్తి పొందడానికి పాండవులు ఇక్కడ ఐదు లింగాలను ప్రతిష్టించి పూజించారని అయితే అవి ఎప్పుడో ఒకసారి మాత్రమే దర్శనమిస్తాయని చెబుతారు. అయితే ఈ శివలింగాన్ని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి పోతాయని భక్తులు విశ్వసిస్తారు. చూశారుగా స్థంభేశ్వరనాథ ఆలయ విశిష్టత మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి.