గ్రహణం వేళ ఈ ఆలయం మూసేయరు సరే ప్రత్యేక పూజలు.. కారణం ఇదే!

151

మరొక చంద్రగ్రహణం మనల్ని కనువిందు చెయ్యడానికి వచ్చేసింది. పాక్షిక చంద్రగ్రహణం పురస్కరించుకుని మంగళవారం సాయంత్రం దేశంలోని ప్రధాన ఆలయాలను మూసివేయనున్నారు. అర్ధరాత్రి 1.30 గంటల తర్వాత గ్రహణం సంభవించనుండగా, ఆగమశాస్త్ర ప్రకారం 6 గంటల ముందే ఆలయాలను మూసివేయాలి. రాత్రి 1.30 నుంచి తెల్లవారుజామున 4.30 గంటలకు వరకు గ్రహణం ఉంటుంది కాబట్టి, బుధవారం ఉదయం 5 గంటలకు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో తిరుమల, భద్రాచలం, విజయవాడ, శ్రీశైలం, యాదాద్రి.. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలను గ్రహణం కారణంగా మూసివేస్తున్నారు. గ్రహణం ప్రభావం వల్ల దేవతల శక్తి క్షీణిస్తుందని నమ్మకం. ఆలయాల్లో ఉండే దేవతా ప్రతిమల్లో శక్తి క్షీణించకుండా ఉండటం కోసం మూసేస్తారు. గ్రహణం పాక్షికమైనా, సంపూర్ణ గ్రహణమైనా.. ఆలయాలను మూసేయడం ఆనవాయితీ. గ్రహణం పట్టడానికి ఆరు గంటల ముందే ఆలయాలను మూసేసి, విడిచిన తర్వాత తిరిగి తెరుస్తారు. తర్వాత శుద్ధి చేసి, పుణ్యావహచనాలు, పూజాధికాలు నిర్వహించిన తర్వాత భక్తులను దర్శనానికి అనుమతి ఇస్తారు. దేశవ్యాప్తంగా ఇలా ఆలయాలను మూసి వేస్తే.. శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు.

Image result for chandra grahanam

శ్రీకాళహస్తి ఆలయంలో నవగ్రహ కవచం ఉంది. దీంతో గ్రహణం ఏర్పడినా ఆలయంలోని దైవశక్తి క్షీణించదని అంటారు. అందుకే గ్రహణం సమయంలోనూ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. ఇదొక్కటే కాదు.. గ్రహణం వేళ ఈ ఆలయంలో పూజలు చేస్తే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఈ నమ్మకం కారణంగానే గ్రహణ సమయంలో శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసేందుకు భక్తులు తరలి వస్తారు. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. గ్రహణం పట్టని దేవాలయంగా కూడా పిలుస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారకుడు, నవ గ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులను దర్శనమిస్తుండటం వల్ల రాహువు, కేతువులు ఈ ఆలయంలోకి ప్రవేశించలేవు. అందుకే శ్రీకాళహస్తిలో భక్తులు రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. వాయులింగేశ్వరుడు నవగ్రహ కవచం ధరించి ఉన్నాడు. ఇలా ధరించడంతో గ్రహాలన్నింటినీ శివుడు తన ఆధీనంలో ఉంచుకున్నాడు.

ఈ క్రింది వీడియో ని చూడండి

వాయువు అంటే ప్రాణం. వాయువు ఉంటేనే ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంటేనే వాయువు ఉంటుంది. ఈ క్షేత్రం కూడా వాయువంతటి గొప్పది. ఇక్కడ వెలసిన జ్ఞానప్రసూనాంబ అమ్మవారు ఇంద్రునికే జ్ఞానాన్ని ప్రసాదించిన దేవత. ఈ క్షేత్రంలో పరమశివుడే కైలాసగిరులుగా వెలిశాడు. దేశంలో చాలా చోట్ల దక్షిణ కాశీలు ఉన్నాయి.. కానీ ఈ సృష్టిలో కైలాసం ఒక్కటే ఉంది. అలాగే దక్షిణ కైలాసం కూడా ఒకే ఒక్కటి ఉంది… అదే శ్రీకాళహస్తి. భూలోకంలో ఇంత పరమ పవిత్రమైన క్షేత్రం మరెక్కడా లేదంటారు. ఇక్కడ ఆలయ శిఖరాన్ని దర్శిస్తే కైలాసం చూసినట్లే. అంతేకాదు, భక్తుడికి అగ్రతాంబులం వేసిన క్షేత్రం కూడా. అందుకే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమేశ్వరుడి ముఖ్య భక్తుడు భక్తకన్నప్పకు తొలి పూజ చేస్తారు. దేశంలోనే అన్ని ఆలయాల్లో భక్తులు సవ్యదిశలో ప్రదక్షిణం చేసి స్వామి, అమ్మవారిని దర్శించుకుంటే ఇక్కడ మాత్రం అపసవ్య దిశలో ప్రదక్షిణం చేసి శివుని, జ్ఞానప్రసూనాంబను దర్శించుకోవడం ప్రత్యేకత. అందుకే ఇక్కడ రాహు-కేతువులు శాంతిస్తున్నాయని అంటారు. శ్రీకాళహస్తిలో పశ్చిమాభిముఖాన స్వామివారి ఆలయం ఉండటంతో ఖ్యాతి నలుదిశలా వ్యాప్తి చెందుతోంది.