వరలక్ష్మి వ్రతం రోజున వీటిని నైవేద్యంగా పెడితే లక్ష్మి కటాక్షం కలుగుతుంది

125

మన హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రావణ మాసం శుక్ల పక్షంలో పొర్ణమి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటారు. శుక్రవారం ఉదయం 6.28 నుంచి 8.45 వరకు సింహలగ్నం, ఈ రెండు గంటల 17 నిమిషాలలో పూజ చేసుకోవచ్చని పండితులు తెలియజేశారు. ఈ ముహూర్తం దాటితే మధ్యాహ్నం 1.21 నుంచి 3.39 మధ్య వృశ్చికలగ్నం ముహూర్తం 2.18 గంటలు, తిరిగి రాత్రి 7.26 నుంచి 8.53 వరకు కుంభలగ్నం 1.28 నిమిషాలు, రాత్రి 11.54 నుంచి 1.49 వరకు వృషభలగ్నంలో పూజచేసుకోవాలని సూచిస్తున్నారు. మహిళలు సంతానం, అష్ట ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ఈ వ్రతాన్ని చేస్తారు. పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏదైనా ఆటంకం కారణంగా వరలక్ష్మి వ్రతం చేయటం కుదరకపోతే శ్రావణ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం నాడు చేసుకోవచ్చు.

Image result for వరలక్ష్మి

వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు వేకువ జామునే లేచి.. ఇంటిని శుభ్రపరుచుకుని.. గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు కడతారు. స్నానాదులను ముగించి, కొత్త వస్త్రాలు ధరించి, పుష్పాక్షతలచే దేవిని పూజిస్తారు. లక్ష్మీదేవిని పూజకు స్థాపించే ప్రదేశంలో పిండితో నేలపై గోమాత పాదాలు, పద్మాన్ని వేస్తారు. బంగారు, వెండి మరేదైనా లోహపు కలశానికి పసుపు రాసి, గంధం పూసి, ఆపై కుంకుమ బొట్టు పెడతారు. కలశాన్ని నీటితో నింపుతారు. దానిలో మామిడి ఆకులు, అక్షతలు ఉంచి, పైన కొబ్బరికాయను పెట్టి పిండితో వేసిన పద్మంలో కొత్త రవికెల గుడ్డను పరుస్తారు. ఆ వస్త్రంపై బియ్యం పోసి, దానిపై కలశాన్ని స్థాపిస్తారు. కొందరు వరలక్ష్మీ దేవిని కొబ్బరికాయకు పసుపు రాసి, పిండితో ముక్కుచెవులను చేసి, కాటుకతో కళ్ళను దిద్ది, బొట్టు పెట్టి కలశంలో దేవి విగ్రహాన్ని స్థాపిస్తారు. ఈ విగ్రహాన్ని బంగారు లేదా వెండి ఆభరణాలతో అలంకరిస్తారు. అలాగే, మరి కొందరు కొబ్బరికాయకు బంగారు లేదా వెండి ముఖాన్ని అమర్చి శుభ్రమైన పూలు, ఆభరణాలతో దేవిని అలంకరిస్తారు. ముందుగా విఘ్ననాయకుడైన వినాయకుని పూజించి, తరువాత వరలక్ష్మీదేవిని ఆహ్వానించి, సకలోపచారాలతో పూజిస్తారు. తొమ్మిది పోసలు వేసి తొమ్మిది సంఖ్యలో దేవిని పూజిస్తారు. ఆ దేవి రక్షాబంధనంగా తమ ఎడమ చేతికి దానిని కట్టుకుంటారు.

లక్ష్మీ అష్టోత్తర శత నామాలతో దేవిని పూజించి తొమ్మిది రకాలైన పిండి వంటలతో మహా నైవేద్యాన్ని సమర్పిస్తారు. మహాలక్ష్మీకి సమర్పించే నైవేద్యాలు శుచిగా వుండాలి. ఇంట్లో తయారు చేసినవిగా వుంటే ఇంకా మంచిదని పండితులు అంటున్నారు. తీపి పదార్థాలను అమితంగా ఇష్టపడే శ్రీదేవికి రవ్వలడ్డూలు, అటుకుల లడ్డు, స్వీట్ పొంగలి, పాయసం, రవ్వ కేసరి, చలిమిడి, సొరకాయ పాయసం, చంద్రకాంతులు, బెల్లం గారెలు, బూరెలు, పాల ముంజలు, బొబ్బట్లు, తీపి అటుకులు, పులిహోర, తాలింపు శెనగలు, గారెలు వంటివి సమర్పించుకోవచ్చు. ఆ రోజు ఇళ్లన్నీ ఆధ్యాత్మిక కళతో అలరారుతాయి. ఇంటిల్లిపాదీ షడ్రసోపేతాలతో భోజనాలు చేస్తారు. పెళ్లయిన మహిళలు పూజ తర్వాత ముతైదువులకు తాంబూలాదులు ఇచ్చి, వారి దీవెనలు అందుకుంటారు. మంగళహారతి గీతాలను పాడి వరలక్ష్మీ కృపను కోరుకుంటారు.